జూలూరుపాడు, అక్టోబర్ 4 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు, జూలూరుపాడు మండల, గ్రామ కమిటి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని, విభేదాలను పక్కన పెట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. ఇందు కోసం కార్యకర్తలంతా సమిష్టిగా కృషిచేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పార్టీ గెలువకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తే వారి కాగడాలని తిప్పి కొట్టాలన్నారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో పనిచేసి ధైర్యంగా ముందుకెళ్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నాని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యంగా రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట నిలబడుతున్నారని పేర్కొన్నారు. పింఛన్లు పెంచలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, పంతాలకు వెళ్లకుండా పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లాకావత్ హేమ్లా, రెడ్డిబోయిన రాము, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా సేవా, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, కొడెం సీతాకుమారి, పదిమల రాంబాబు, తాళ్లూరి రామారావు, సాయిని హరీష్, భూక్యా చందు, దిగిన్ని అప్పారావు, బానోత్ శంకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.