శాసనసభ ఎన్నికల ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే మేళతాళాలు, మహిళల కోలాటాలు, కార్యకర్తల నినాదాల మధ్య రోడ్ షోలు నిర్వహించారు. ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించడంతోపాటు వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధువులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గడప గడపకూ తిరుగుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తున్నారు. నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రఘునాథపాలెం మండలంతోపాటు ఖమ్మం నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ గురువారం ఇలా కనిపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం ఆయన సతీమణి వసంతలక్ష్మి ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం ఆయన వదిన జయశ్రీ, ఆమె కోడలు సాయిశిరిణి ఖమ్మం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పువ్వాడ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక్కడ.. అక్కడ.. అని కాకుండా పని ప్రదేశాలకే వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గురువారం బోనకల్లు మండలం రాపల్లెలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఏజెన్సీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో గెలిచే దిశగా వెళ్తున్నారు. గురువారం ఆయన దుమ్ముగూడెం మండలం మహదేవపురంలో పర్యటించగా స్థానికులు ఇలా బీఆర్ఎస్కు జై కొడుతూ కనిపించారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు దిశానిర్దేకత్వంలో గులాబీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లాకేంద్రంలో ఓ మహిళ హారతి ఇచ్చేందుకు ఇలా ఎమ్మెల్యే అభ్యర్థి వనమా ప్రచార వాహనంపై కనిపించింది.
వైరా నియోజకవర్గంలో గులాబీ సేన ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్‌తో కలిసి గ్రామగ్రామానికి వెళ్తున్నది. గురువారం మదన్‌లాల్ కొణిజర్ల మండలంలో పర్యటించారు. చిన్నాపెద్దా అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు అలుపు లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏజెన్సీలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గురువారం ములకలపల్లి మండలంలో పర్యటించి ప్రతి గ్రామంలో గ్రామస్తులతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మణుగూరు నియోజకవర్గంలో గులాబీ సేన దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు నిర్దేశకత్వంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నది. గురువారం రేగా కాంతారావు మణుగూరు పట్టణంలో ప్రచారం నిర్వహించగా ఓ మహిళ ఇలా ఆయనకు విజయ తిలకం దిద్దింది.
సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గురువారం రాజ్యసభ సభ్యుడు బండిపార్థసారథిరెడితో కలిసి వేంసూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ఓ యువతి ఇలా సండ్రకు ఆల్ ది బెస్ట్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.
ఇల్లెందు మండలం కొమ్ముగూడెం, పాత పూసపల్లికి చెందిన 250 కుటుంబాలు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియా నాయక్ సమక్షంలో గులాబీ గూటికి చేరాయి. అనంతరం బీఆర్ఎస్ను గెలుపును కాంక్షిస్తూ జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ నినదిస్తూ కనిపించారు.