ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచగలిగే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. అందుకే ఈ స్థానంలో తన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరఫున మరోసారి ఖమ్మం ఎంపీగా పోటీచేస్తున్న ఆయన.. బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. లోక్‌సభ సభ్యుడిగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచి జాతీయ రహదారుల కోసం కేంద్రంతో పోరాడానని, జిల్లాకు వాటిని తీసుకొచ్చానని వివరించారు. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించానని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తన గెలుపును ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నామా విమర్శించారు. ముఖ్యంగా మహిళలను, రైతులను వంచించిందని ఆరోపించారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మహిళలను, రైతులను, కౌలు రైతులను మభ్యపెట్టిందని దుయ్యబట్టారు. ఇప్పుడు హామీలను అమలుచేయలేక చేతులెత్తేయడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. గత పదేళ్లలో ఎన్నడూలేని విధంగా తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
గత వారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించిందని బీఆర్ఎస్ అభ్యర్థి నామా పేర్కొన్నారు. వాటికి హాజరైన అశేష ప్రజావాహినే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అలాగే, మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి మహిళకూ రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదు నెలలుగా ప్రతి మహిళకూ రూ.12,500 బాకీ పడిందని అన్నారు. వాటిని అందించాకే కాంగ్రెస్ పాలకులు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుండా ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. కర్షకులపై కాంగ్రెస్‌కు ఏమీ ప్రేమలేదని, అందుకే జిల్లాలో ఒక్క తడికి కూడా సక్రమంగా సాగునీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ అసమర్థతకు ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించింది, తెలంగాణ గొంతుక వినిపించింది తానేనని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే పెండింగ్ సమస్యలపైనా, తెలంగాణకు రావాల్సిన నిధులపైనా గళమెత్తుతానని మాట ఇచ్చారు. గత లోక్‌సభలో తెలంగాణ రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలం తప్ప.. కాంగ్రెస్, బీజేపీల ఎంపీలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. తమతో కలిసిరావాలని కోరినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు.
గ్యారెంటీ హామీలపై రాష్ట్ర ప్రభుత్వంపైనా, తెలంగాణపై వివక్షపై కేంద్ర ప్రభుత్వంపైనా పోరాడి వాటి మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమేనని నామా తేల్చిచెప్పారు. కాంగ్రెస్ చెప్పిన కౌలు రైతులకు రూ.15 వేలు, వరి పంటకు రూ.500 బోనస్, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం వంటి హామీలన్నీ తుస్సుమన్నామని విమర్శించారు. తనకు లభించిన ప్రతి అవకాశాన్నీ ఖమ్మం జిల్లా పురోభివృద్ధికి వినియోగించానని, ఖమ్మం అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించానని వివరించారు.
రానున్న రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశంలేదని అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ విశ్లేషించినట్లు దేశంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అందులో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకమని అన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషిచేస్తానని అన్నారు. తాను రైతు పక్షపాతినని, నష్టాల్లో ఉన్న పాలేరు చక్కెర కర్మాగారాన్ని కొనుగోలు చేసి రైతుల కోసం 22 ఏళ్లుగా నడిపిస్తున్నానని వివరించారు.