కూసుమంచి, మే 6 : తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకుపోతుందని, ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కోరారు. సోమవారం కూసుమంచి మండలంలో నామా విజయాన్ని కాంక్షిస్తూ మునిగేపల్లి, నేలపట్ల, కోక్యాతండా, లోక్యాతండాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం గట్టుసింగారంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు మంచి పార్లమెంటేరియన్‌గా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.
పాలేరు నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా ఓట్లు వచ్చాయని, ఈసారి కూడా నామాకు అత్యధికంగా ఓట్లు వచ్చే విధంగా ప్రతిఒక్కరూ పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కోరారు. ప్రతిఒక్కరూ ఈ వారంరోజులు కష్టపడి నామాకు ఓట్లు వేయించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్, ఇంటూరి శేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, ఎంపీటీసీలు తిరుపతమ్మ, అలీ, వెల్లపల్లి కోటేశ్వరరావు, బారి మల్సూర్, వీరబాబు పాల్గొన్నారు.