ఖమ్మం రూరల్, జనవరి 8 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలిచి పోరాడటమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఈ నెల 9న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగా బుధవారం సాయిగణేశ్ నగర్‌లోని కందాల క్యాంపు కార్యాలయం వద్ద కందాల యువసేన అధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బాషబోయిన వీరన్నలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. తొలుత రూరల్ మాజీ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, నాగుబండి శ్రీనివాసరావు, కందాల యువసేన బాధ్యుడు మేకల ఉదయ్, సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్‌నాయక్‌లు రక్తదానం చేశారు.
అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన 125 మంది నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాతా మధు, సండ్ర మాట్లాడారు. ఐదేళ్లపాటు పాలేరు ప్రజలను తన కుటుంబ సభ్యులుగా కందాల భావించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కందాల గెలవడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, గూడ సంజీవరెడ్డి, ముత్యం కృష్ణారావు, ఆసిఫ్, మల్లీడు వెంకన్న, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కందాల యువసేన బాధ్యులు పాల్గొన్నారు.