ఖమ్మం: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.25 వేల కోట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఐదేండ్లలో మహిళలకు లక్ష కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామన్నారు. రుణాలు ఇవ్వడంతోపాటు వారు వ్యాపారాల్లో రాణించడానికి సహకారం, ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
ఆర్టీసీలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయడానికి ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి బస్సులు కొనుగోలు చేయిస్తామని, వాటిని ఆర్టీకి కిరాయికి ఇప్పిస్తామన్నారు. తద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. మహిళల భాగస్వామ్యంతో ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే వారి కుటుంబం బలపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు.