భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ఇన్నాళ్లూ విధులు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక సేవలు ప్రశంసనీయమైనవని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రియాంక దంపతులను కొత్తగూడెంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియాంక దంపతులను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడంలో కలెక్టర్‌గా ప్రియాంక కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఇటు ప్రజలకు, అటు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఎన్నికలను సమర్థంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆమె ఇలాగే ఉత్తమ సేవలందించాలని, ప్రజలకు మరింత మంచి చేయాలని, అందరి మన్ననలూ పొందాలని ఆకాంక్షించారు. నాయకులు ఆళ్ల మురళి, నాని, భూక్యా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.