కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 28 : క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చూట్టూ తిరగాల్సి వస్తుందని, ఇందుకు రాజీయే రాజ మార్గమని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ క్రిమినల్ కేసులు 2,462, మోటర్ యాక్సిడెంట్ కేసులు 26 కాగా.. రూ.1,46,95,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
బ్యాంకు రికవరీ కేసులు 77, సైబర్ క్రైం కేసులు 42 కలిపి మొత్తం 4,313 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. అనంతరం రూ.73,14,871 చెక్కును ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పంజాగుట్ట బ్రాంచి డిప్యూటీ మేనేజర్ మోహన నుంచి ప్రమాదంలో చనిపోయిన త్రీ ఇైంక్లెన్ తండాకు చెందిన బానోతు రవికుమార్ భార్య వినోద, పిల్లలకు జడ్జి అందజేశారు.
ఎస్బీఐ కొత్తగూడెం సౌజన్యంతో కక్షిదారులకు ఏర్పాటు చేసి పులిహోర, మంచినీటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి, మెజిస్ట్రేట్లు రామారావు, సాయిశ్రీ, శివనాయక్, ఖమ్మం నుంచి బీమా న్యాయవాదులు కొత్తపల్లి రామారావు, గురజాల సీతారామారావు, శెట్టిపల్లి వెంకటరామారావు, అంబటి రమేశ్, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.