భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్యాధికారులు మాతాశిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముందుగా పర్ణశాల, దుమ్ముగూడెం, అశ్వారావుపేట ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మరణాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. గర్భ నిర్ధారణ జరిగిన నాటినుంచి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. హైరిస్క్ ఉన్న మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రసవానికి ఆస్పత్రికి వచ్చిన సమయాల్లో తక్షణమే వైద్యసేవలు అందించాలని చెప్పారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరణాలు జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు శిరీష, రవిబాబు, రాజ్‌కుమార్, సుకృత, రామకృష్ణ, చైతన్య, సరళ, సింధు తదితరులు పాల్గొన్నారు.
గర్భిణి నుంచి ఆరోగ్యవంతమైన చిన్నారుల జననం వరకు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సేవలపై సీడీపీవోలు, సూపర్వైజర్లతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషణలోప చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి విజేత తదితరులు పాల్గొన్నారు.