మంచిర్యాల, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను మంచిర్యాల జిల్లా కోర్టులో నాలుగు రోజులు విచారించేందుకు వేసిన పోలీస్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణకు వచ్చింది. అయితే అసలు పోలీసులు పెట్టిన రాళ్ల దాడి కేసుకు, కస్టడీకి ఇవ్వాలంటూ కోరిన అంశాలకు పొంతన లేదంటూ సుమన్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో కస్టడీ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కస్టడీ పిటిషన్‌కు ముందు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, కౌంటర్ పిటిషన్ వేసేందుకు పోలీసులు సమయం కోరడంతో బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడినట్టు న్యాయవాదులు తెలిపారు. కాగా, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నది.
క్యాతనపల్లి ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి దేవాపూర్ ఎస్సై గంగారాం స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న క్యాతనపల్లి ఫ్లై ఓవర్ వద్దకు అనుమతి లేకుండా వాహనాల్లో వచ్చిన బాల్క సు మన్, ఇతర బీఆర్ఎస్ నాయకులను సిబ్బందితో కలిసి తాను అడ్డుకోవడం వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్తుండగా, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేయడంతో కానిస్టేబుల్ తలకు, కోటపల్లి ఎస్పై చేతికి గాయమైందని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటనను స్వయంగా చూసిన పోలీస్ అధికారి రాళ్ల దాడి చేసినట్టు కేసు పెడితే.. దాడిలో మారణాయుధాలు వాడారని, ఇందుకు తగిన ఆధారాలున్నాయని వాటిని స్వాధీనం చేసుకొని వాటికి నిధులు ఇచ్చిందెవరో విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఘటనకు ముందు ఏ1 బాల్క సు మన్, ఏ2 మూల రాజిరెడ్డి, ఏ4 దోమకొండ అనిల్, ఏ8 లక్ష్మీకాంత్, ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు, సీపీఐ కార్యకర్తల కుట్ర చేసి దాడి చే శారా..? దాడికి ముందు వాళ్లు ఎక్కడ సమావేశమయ్యారు? మారణాయుధాలు ఎవరు సమకూర్చారు? అని కేసుకు సంబంధం లేనివి చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఎస్ఐ పెట్టిన కేసుకు.. కస్టడీకి కోరుతున్న అంశాలకు సంబంధం లేకుండా పోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఎస్సై కేవలం రాళ్ల దాడి అని కేసు పెడితే.. ఇప్పుడు మారణాయుధాలు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మారణాయుధాలు ఉంటే ఘటనకు సంబంధించిన వీడియాల్లో అవి ఎక్కడ కనిపించాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పరిధి దాటి, బాల్కసుమన్, మూల రా జిరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ రావొద్దని కొత్త నాటకానికి తెర తీసినట్లుగా కస్టడీ పిటిషన్ ఉంది. పోలీసులు విచారణ కోసం కేసు పెట్టినప్పుడు కస్టడీ పిటిషన్ అం శాల్లో పేర్కొనట్టు మారణాయుధాలు, సమాజ వ్యతిరేక శక్తుల ప్రస్థావన, వంటి అంశాలేవీ లేవు. పెట్టిన కేసుకు.. వేసిన కస్టడీ పిటిషన్‌కు సంబంధం లేదని బలమైన వాదనలు వినిపించాం. వందల సీసీ కెమెరాలు, వందల మీడియా కెమెరాలు ఉన్నాయి. మరణాయుధాలు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఇరువర్గాల మధ్య గొడవ జరిగితే.. కేవలం ఒక పక్షం మీదే కేసు పెట్టడంపై సందేహాలు వ్యక్తం చేశాం. ప్రజాస్వామ్యం కోసం బీ ర్ఎస్ నాయకులు కొట్లాడారని వివరించాం.