హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్టు అర్థమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్బీఐ నివేదికను ఉటంకిస్తూ రాష్ట్రంలో విద్యారంగానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
బీహార్‌లాంటి రాష్ట్రాలు విద్య కోసం ఏకంగా 20 శాతం నిధులు కేటాయిస్తుంటే, తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నదని అన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం పేరుతో కోట్లు ఖర్చు చేసి కమీషన్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించి వాటిస్థానంలో ఇంటిగ్రేటెడ్ సూల్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, ఆ సూల్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బంధువులకు కట్టబెట్టి కాసులు దండుకోవాలని ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్య కోసం 15 శాతం నిధులు ఖర్చు పెడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని గుర్తుచేశారు.