మహబూబ్‌నగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూ అక్రమాలపై డొంక కదులుతున్నది. ‘కమీషన్ల ఎర.. రికార్డులకు చెర’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. పేరపళ్లలో భూ అక్రమార్కుల పన్నాగాన్ని పటాపంచలు చేస్తూ ఇచ్చిన కథనంపై నారాయణపేట అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీను విచారణ జరిపా రు. ఉదయం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది.
ఈ మేరకు పేరపళ్లలో రైతుల పేరుతో భూపరిహారాన్ని స్వాహా చేసినందుకు కాంగ్రెస్ నేతల సహకారంతో రెవెన్యూ రికార్డులు మా ర్చినట్టు ఆధారాలతో బయటపెట్టడంతో రెవె న్యూ అధికారులు కంగుతున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ కావడంతో అదనపు కలెక్టర్ ఆర్డీవో కార్యాలయానికి పరుగులు పె ట్టారు. ఇదిలా ఉండగా 1969లో అసైన్డ్ భూములను పంచినట్టు రికార్డులు సృష్టించడంతో అసలైన రైతులు కూడా కంగుతింటున్నారు. ఎత్తిపోతల పథకంలో మునుగుతున్న ప్రభుత్వ భూముల్లో కమీషన్లు ఇస్తే పట్టాదారులుగా ప్రవేశించి నష్టపరిహారం జాబితాలో చేర్చుతామని చెప్పి రికార్డులను తారుమారు చేశారు. ఇదిలావుండగా తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా రికార్డులను తీసుకెళ్లి అదనపు కలెక్టర్ ముందుంచారు.
పేరపళ్లలో సర్వే నంబర్ 111లో ఆరెకరాల భూమి ముంపునకు గురవుతున్నట్టు పేర్కొన్న నలుగురు రైతుల పేర్లు మూడో జాబితాలో క న్పించకుండా పోయాయి. ‘మీ భూమి పో తుంది.. ఏకంగా ఆరు ఎకరాలకు రూ.1.2 కోట్లు మంజూరు చేశారు’ అని అధికారులు పొట్ట కిష్టప్ప, లాలప్ప, బాలప్ప, చిన్న బాలప్ప దృష్టికి తీసుకెళ్లారు. తమ పొలం పంప్‌హౌస్‌లో మునిగిపోదని సదరు రైతులు ఎంత చె ప్పినా వినలేదు.
దీంతో సదరు రైతులు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా ఈ రైతులపైనే కోర్టులో కేసు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరికి ఇచ్చిన పరిహారాన్ని కోర్టులో జమ చేశారు. అంతటితో ఆగకుండా పనులను అడ్డగిస్తున్నట్టు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో కథ నం రావడంతో మూడోసారి సిద్ధం చేసిన నోటిఫికేషన్ నుంచి ఈ నలుగురు రైతుల పేర్లను తొలగించారు. నోటిఫికేషన్ నుంచి పేర్లను తొలగించినప్పటికీ కోర్టులో వీరి పేరిట జమైన పరిహారం సంగతేందనేది వారికే తెలియాలి.
ఎత్తిపోతల పథకంలో ఎలాంటి అక్రమాలు జరుగలేదని బుకాయించేందుకు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో హుటాహుటిన నారాయణపేటకు వచ్చి పరిశీలించిన సదరు అధికారి.. కారు దిగకుండానే అద్దాల్లోంచి భూములను పరిశీలించి నిమిషాల్లోనే వెనుదిరిగారు. మీడి యా ప్రశ్నించే లోపే జెట్ స్పీడ్‌తో నారాయణపేటకు చేరుకున్నారు. కలెక్టరేట్లో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన ఆయన ప్రాథమిక నివేదికను అనుకూలంగా తెప్పించుకొని అక్రమాలు ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తున్న ది. దీని ఆధారంగా పంప్‌హౌస్‌లో మునిగినట్టు చూపించిన నలుగురు రైతులకు సంబంధించి ఆరు ఎకరాలను తొలగించి అంతా అయిపోయిందని చేతులు దులుపుకొన్నారు. ఈ నివేదిక ఇచ్చిన కొన్ని గంటల్లోనే.. రెవెన్యూ రికార్డులను మార్చినట్టు స్పష్టమైన ఆధారాలతో ‘నమస్తే తెలంగాణ’ బృందం బయటపెట్టడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రెవెన్యూ కార్యాలయాల సాక్షిగా 1969లో నే అసైన్డ్ పట్టాలు ఇచ్చినట్టు సృష్టించిన రికార్డు ‘నమస్తే తెలంగాణ’ చేతికి ఎలా వెళ్లిందో ఆరా తీస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగమే దీనిని బయట పెట్టిందని కొందరు అంటుంటే.. భూ ములు పోయి పరిహారం రాని రైతులు ఈ వ్య వహారాన్ని బహిర్గతం చేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద అక్రమాలకు ప్రధాన సాక్ష్యమైన రిజిస్టర్ కీలకమైంది.
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో పరిహారం పేరుతో కాంగ్రెస్ నాయకులు కోట్లు దండుకోవడానికి వేసిన ఎత్తుగడపై సాక్ష్యాధారాలతో శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తోపాటు లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేయనున్నారు.