భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బీఎల్వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం ఐడీవోసీలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పన, ఫారాలు 6, 7 గురించి వివరించారు. పార్టీల నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.
వారి జాబితాను పార్టీ జిల్లా ఇంచార్జిలు ధ్రువీకరణ చేసి ఇవ్వాలన్నారు. నూతన ఓటరు జాబితా, చేర్పులు, మార్పులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తొలగింపు జాబితాను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఫారం 6, 7, 8లలో 19,514 దరఖాస్తులు రాగా.. వాటిలో 10,944 దరఖాస్తులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.