కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఫిబ్రవరి 18 : భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ, శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతిని ప్రామాణికంగా తీసుకోవద్దని, అది ఒక మెట్టు మాత్రమేనని, ఆ తర్వాత అనేక కోర్సులు చదవాలన్నారు. విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదో తరగతి చదివేటప్పుడు మంచి ఇంజినీర్ అవుదామని అనుకున్నానని, తర్వాత నా లక్ష్యాన్ని మార్చుకొని పట్టుదలతో చదివి కలెక్టర్ అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు అన్ని రకాల పుస్తకాలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు.
వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్, ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వార్డెన్లు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్లు సైదులు, నాగరాజు, శేఖర్, విజయభాస్కర్, శ్యాంచందర్రావు వివిధ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్పించారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అనసూర్య, ఏఎస్డబ్ల్యూవోలు హనుమంతరావు, సునీత, హెచ్డబ్ల్యూవోలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామనర్సయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు.