చండ్రుగొండ, మే 1: నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు.
దీని గురించి అధికారులు.. లబ్ధిదారులకు దిశానిర్దేశం చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. రైతులు కోసిన ధాన్యం ఆరబెట్టుకోవాలని, తేమ శాతం వస్తే వెంటనే కాంటాలు వేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడంతోపాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఎంపీవో ఖాన్, ఏవో వినయ్ తదితరులు పాల్గొన్నారు.