వైరా టౌన్, జూన్ 5: ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. వైరా మండలం నారపనేనిపల్లి ఎంపీయూపీఎస్లో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడారు.
పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించామని, ప్రస్తుత సంవత్సరం బడిబాట కార్యక్రమంలో కనీసం మరో 20 మంది విద్యార్థులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో రిజిస్టర్ ప్రకారం పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు 56 వరకు ఉంటారని, వీరిలో ఈ సంవత్సరం కనీసం 20 మందిని ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మన పూర్వికులందరూ గొప్పస్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.
పిల్లలను పాఠశాలలకు తరలించడం కోసం 7 సీటర్ ఆటోలను ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు ఏర్పాటు చేస్తున్నామని, ఆరు నెలల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అన్నారు. కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు.
పాఠశాలల్లో ‘ఉయ్ కెన్ లెర్న్’ అనే ఇంగ్లిష్ ల్యాబ్లను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. నిరుటి టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల్లో 96 శాతం ఉత్తీర్ణత ఉందని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న 60 ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ చేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచి ఎక్కువ మంది విద్యార్థులను మళ్లీ వచ్చేలా కృషిచేస్తున్నామని అన్నారు. డీఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఉమ, రాంబాబు, పంచాయతీ కార్యదర్శి అనూష పాల్గొన్నారు.