ఖమ్మం, అక్టోబర్ 17 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్‌లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బంద్ జరుగనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు వివిధ బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే కార్యాచరణను పూర్తి చేశారు. నాలుగు రోజులుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతోపాటు సకల జనులను కలిసి తమ గోడు వివరించి వారి మద్దతును కూడగట్టారు. దీంతో బీసీలు తలపెట్టిన బంద్‌కు ఇప్పటికే విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కూడా పాల్గొని బంద్‌ను విజయవంతం చేయనున్నారు.
మాయమాటలు, మోసపు హామీలకు చిరునామా అయిన కాంగ్రెస్‌ను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలామంది ప్రజలు నమ్మారు. గ్యారెంటీ హామీలనడంతో ఓట్లు వేసి గెలిపించారు. 42 శాతం రిజర్వేషన్ల పేరు చెప్పగానే బీసీలు కూడా కాంగ్రెస్ మాయలో పడ్డారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అటు గ్యారెంటీలు హామీలూ అమలుకాలేదు. ఇటూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లూ ఖరారు కాలేదు. దీంతో అటు ఆయా వర్గాల ప్రజలు, ఇటు బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అత్యంత ఆగ్రహంగా ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా బుద్ధిచెబుదామన్న కసితో ఉన్నారు.
దీనిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఏడాదిన్నరగా వాయిదా వేస్తూ వచ్చింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు మొట్టికాయలతో ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు పూనుకుంది. అందులోనూ బీసీలను మళ్లీ మోసం చేయాలని, ఓట్లు కొల్లగొట్టాలని పన్నాగం పన్నింది. ఇందుకోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో సవరణ చేయకుండా, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను పెంచకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని తెలిసినా కపట నాటకాలు ప్రదర్శించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపినా, ఆయన ఇంకా ఆమోదించకున్నా మొండిగా ముందుకు వెళ్లింది.
జీవోను నంబర్ 9ని తెచ్చి దాని ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావించింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో మిన్నకుండిపోయింది. తమ పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి, రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని మరోసారి మాయమాటలు చెబుతూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ మోసాలను పూర్తిగా గమనించిన బీసీలు.. దానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. హామీ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు, సంఘాల మద్దతుతో శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోనూ బంద్‌ను సంపూర్ణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బీసీల ద్రోహి అయిన సీఎం రేవంత్‌రెడ్డికి తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ బీసీలంతా శపథం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, కార్మిక యూనియన్లు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ సహా సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, బీజేపీ, ఎన్డీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు మాలమహానాడు, ఎంఆర్పీఎస్ లాంటి సంఘాలు మద్దతు ప్రకటించాయి.