భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, అక్టోబర్ 3: బతుకమ్మ వేడుకలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పులకించిపోతోంది. ఊరూవాడంతా పూలపండుగ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి వాడా ఓ పూల వనమవుతోంది. ప్రతి ఊరి చెరువూ పూల తోటవుతోంది. తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటే బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ సంబురాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఖమ్మం కలెక్టరేట్లో అధికారిక ఉత్సవాలు నిర్వహించారు.
రెండు రోజు అటుకుల బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఉద్యోగులు, జిల్లా అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన ఈ అటుకుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక భద్రాద్రి జిల్లాలోనూ రెంరో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.
గ్రామగ్రామాన మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తెచ్చి ఆడిపాడారు. సాయంత్రమయ్యాక స్థానిక జలాశయాల్లోని ఘాట్ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా, తెలంగాణ బతుకు ప్రతీక అయిన బతుకమ్మ ఖండాంతరాలు కూడా దాటింది. భద్రాద్రి జిల్లాకు చెందిన కొందరు ఆడబిడ్డలు అమెరికాలో స్థిరపడగా.. వారు కూడా అక్కడ బతుకమ్మలతో సందడి చేశారు. పూలపండుగ వైభవాన్ని అగ్రరాజ్యంలోనూ చాటిచెప్పారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మలను, రెండో రోజు అటుకులు బతుకమ్మలను పేర్చి సంబురాలు జరుపుకున్నారు.