అశ్వారావుపేట రూరల్, నవంబర్ 9 : గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు పరిధిలో గల లోతట్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు లోతట్టు భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల, పొంగులేటి నీరుపారుదల శాఖ అధికారులను ఆదేశించినా.. ఆక్రమణల పరంపర మాత్రం ఆగడం లేదు. గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో గండిపడి నీరంతా వృథాగా దిగువకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే గండిపడిన ప్రాంతంలో అధికారులు రింగ్ బండ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు పారించుకుంటూ రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న భూమిపై కన్నేసిన ఖమ్మంపాడు, మేకలబండ, కోయరంగాపురం, వడ్డెర రంగాపురం, బచ్చువారిగూడెం గ్రామాలకు చెందిన రైతులు ట్రాక్టర్‌తో దుక్కులు చేసి నువ్వు, మినుము పంటలు సాగు చేస్తున్నారు. ఇలా పంటలు సాగు చేయడం వల్ల ప్రాజెక్టు నీటి నిల్వ ప్రాంతం అంతా పూడికతో నిండిపోతుందని, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సాగునీటి సమస్య తలెత్తుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ప్రాజెక్టు వద్ద జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రులు తుమ్మల, పొంగులేటి రివ్యూలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతంలో పొడి దుక్కులు దున్నడం వల్ల ఇప్పటికే అశ్వారావుపేట మండలంలో 2 వేల ఎకరాలు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కుడి, ఎడమ కాల్వల ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు 8 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోతున్నదని రైతులు వాపోతున్నారు. దీంతో ప్రాజెక్టు లక్ష్యం నీరుగారుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెదవాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలు గుర్తించి ఆయా రైతులపై చర్యలు తీసుకోవాలని, చుట్టూ హద్దులు నిర్ణయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులో పూడిక తీసి సాగు భూములకు ఆ మట్టిని తోలుకుంటే బాగుంటుందని, కానీ.. రైతులు ఆ పని చేయకుండా ప్రాజెక్టు లోతట్టు భూములు సారవంతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆక్రమించి సాగు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. దీనిపై జిల్లా మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.