గార్ల, నవంబరు 3: మీలో ఒకరిగా, మీ కష్టాల్లో తోడుగా ఉన్న నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు. శుక్రవారం గార్ల మండలంలోని పుల్లూరు, బీఆర్ఎన్తండా, రాజుతండా, కోట్యా నాయక్ తండా, పోచారం గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందూతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామాల్లో హరిప్రియకు హారతులతో మహిళలు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలల్లోకి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఉమ్మడి ఏపీలో 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూసిందన్నారు. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందు వరసలో సీఎం కేసీఆర్ ఉంచారని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రజల గుండెల్లో ఉందన్నారు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని చెప్పిన కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగకుండా తరిమికొట్టాలన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్రెడ్డి రైతు బంధు, దళితబంధు పథకాలను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు. ఇల్లెందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభను అక్క చెల్లెలు, అన్నదమ్ము లు భారీ సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వాదించారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మీ ఆశీర్వాదంతో రెండోసారి ఎమ్మెల్యే అయి మీ రుణం తీర్చుకుంటానన్నా రు. సీఎం కేసీఆర్ సార్ దయతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రాంపురం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశామన్నారు. కమలాపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 4.80కోట్లు మంజూరు చేయించానన్నారు. ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐదేళ్లు మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మూడు శివాజీ చౌహన్, ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పానుగంటి రాధకృష్ణ, నాయకులు మందనపు భాస్కర్రావు, తోట కొండల్ రావు, కోట ఉత్తరయ్య, గాజుల గణేశ్, రమేశ్, సర్పంచ్లు మాలోత్ జ్యోతి, ప్రవళిక, మోతిలాల్, శ్రీను, రాంబాయి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మండలంలోని పుల్లూరు , బీఆర్ఎన్తండా, పోచారం, కోట్యా నాయక్తండా, రాజు తండాల్లో ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియా నాయక్ గిరిజనులను అప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాడీ పింఛన్ వస్తుందా…అంటూ గిరిజనులతో లంబాడీ భాషలో మాట్లాడారు. వారు వస్తుంది బిడ్డా అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.