పాల్వంచ, మే 06 : బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా జగన్నాధపూర్ ఆదర్పాడ్ గ్రామానికి చెందిన నృతీస్ స్వయాన్ (25) బతుకుదెరువు కోసం పాల్వంచ పట్టణానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన హిమాన్షు దాసు అనే వ్యక్తితో కలిసి పట్టణంలోని కిన్నెరసాని రోడ్లో గల త్రిబుల్ ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో గత ఆరు నెలల నుంచి వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ రెస్టారెంట్ సమీపంలో వడ్డే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
సోమవారం నృతీస్ స్వయాన్ పుట్టినరోజు కావడంతో అతని రూమ్ లో ఉన్న వ్యక్తితో పాటు తమ ప్రాంతానికే చెందిన పట్టణంలోని స్పైసీ రెస్టారెంట్లో పనిచేస్తున్నమరికొంతమంది యువకులతో కలిసి బృందావన్ బార్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం మిత్రులిద్దరూ కలిసి వారు ఉండే ఇంటికి వచ్చారు. ఇంటి పక్కనే ఉన్న అబ్బు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి డాబాపై పడుకున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో రూమ్‌లో వేడి భరించలేక రోజూ వారు ఇలానే నిద్రిస్తుంటారు.
మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హిమాన్స్ దాస్ నిద్ర లేచి చూడగా నృతీష్ స్వయాన్ కనపడలేదు. దీంతో వెతకగా నృతీష్ స్వయాన్ దాబా కింద మృతి చెంది పడిఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.