జూలూరుపాడు, మే 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ పరిధిలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులు వీచడంతో గ్రామంలోని ఆరు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రేకుల షెడ్లతో నిర్మించుకున్న ఇళ్లపై కప్పులు గాల్లోకి లేచిపోయి, ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన కొర్ర ఝాన్సీ, బానోత్ రామకృష్ణ, మాలోత్ చందులాల్, భానోత్ మంగీత, ఆంగోతు సైదులు, ఆంగోతు నరేష్‌కు చెందిన నివాసాలు ప్రకృతి వైపరీత్యానికి గురై సర్వస్వం కోల్పోగా, వీటితో పాటు మరో పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, నష్ట తీవ్రతను అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఆరు ఇళ్లు పూర్తిగా, మరో పది ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని, తక్షణమే పంచనామా నిర్వహించి నష్ట పరిహారం కోసం ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐతో పాటు జీపీఓ చాంద్ మీరా, స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.

రాంపురంలో గాలి వాన బీభత్సం.. ఆరు ఇండ్లు నేలమట్టం