– నువ్వు ఏ పార్టీలో ఉన్నాఓ ప్రజలకు చెప్పి ఓట్లడుగు
– బీఆర్ఎస్లో తాము గెలిపిస్తే కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తి
– ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత రావులపల్లి
భద్రాచలం, డిసెంబర్ 08 : ఎమ్మెల్సీ తాత మధును విమర్శించే నైతిక హక్కు, స్థాయి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ది కాదని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో తాతా మధుపై తీవ్ర విమర్శలు చేసిన నేపధ్యంలో సోమవారం భద్రాచలంలో రాంప్రసాద్ మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందన్నారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్ధికి మద్దతిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నాడు. కానీ హైదరాబాద్లో మాత్రం తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటూ అబద్దాలాడుతూ ఎవరిని మోసం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాతా మధు కష్టంతో గెలిచిన తెల్లం వెంకట్రావు ముందుగా తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే తెల్లం చేసిన వ్యాఖ్యలకు తగిన బుద్ది చెప్పే సమయం ఓట్ల రూపంలో 11వ తేదీన వెలువడుతుందన్నారు. గోడ దూకుడు రాజకీయాలకు, పార్టీ మారుతూ, బీఆర్ఎస్ శ్రేణులంతా గెలిపిస్తే రాత్రికి రాత్రే పార్టీ మారి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన తెల్లం తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. నైతిక విలువలంటే తెలియని వ్యక్తి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. తాతా మధులాంటి వ్యక్తుల గురించి ఆయన విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.