కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 11 : అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా చింతకాని పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులను దూషించడం సరైంది కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలు చేయడం చేతగాని ముఖ్యమంత్రి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని, నేటి కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో దివాలా తీసి అప్పులపాలు అయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైతే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రిని ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పది స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై అవాకులు చవాకులు పేలితే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, అనుదీప్, రాజు గౌడ్, రవిచంద్ర, సిందూ తపస్వి, లావుడియా సత్యనారాయణ, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.