కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 24 : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ జాబ్ ఆధ్వర్యంలో మూడోరోజు ఉధృతంగా కొనసాగుతున్న సమ్మెలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మాట్లాడారు. కార్మికులు పట్టుదలతో తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలే కానీ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. అనంతరం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కార్మికుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతునిస్తుందని, తానే ముందుండి సమ్మెకు నాయకత్వం వహిస్తానని తెలిపారు. కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా సమ్మె నిర్వహించాలని ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.
అనంతరం కొత్తగూడెం మేయర్ మూడు గణేష్, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్, జై భీమ్ రావు పార్టీ రాష్ట్ర నాయకుడు యెర్ర కామేష్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపన్న నాయకులు మధు, సంజీవ్, సురేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, భారతీయ జనతా పార్టీ నాయకుల తో పాటు పలు పార్టీలకు కార్మిక సంఘాలకు చెందినవారు మాట్లాడుతూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు బి.ఎన్.రావు, నజీర్, భాస్కర్, సరస్వతి, రేణుక, రహంతుల్లా, సైదులు, శేషు, రాటి పాల్గొన్నారు. కాగా మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళులర్పిస్తూ ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించారు.

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు