Ajinkya Rahane : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానే (Ajinkya Rahane) కొత్త అవకాశాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్(ETPL)లో ఆడేందుకు సిద్ధమైన రహానే.. త్వరలోనే కామెంటేటర్‌గానూ అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో తన మార్క్ ఆటతో అలరించిన అతడు.. ఇకపై మాటల హోరుతో అభిమానులతో టచ్‌లో ఉండనున్నాడు. భారత్, శ్రీలంక టెస్టు సిరీస్‌తోనే ఈ మాజీ కెప్టెన్ కొత్త ఇన్నింగ్స్ మొదలవ్వనుంది.
రిటైర్మెంట్ అనంతరం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అజింక్యా రహానే. భారత జట్టును వీడినప్పటికీ క్రికెట్‌తోనే కొనసాగాలని భావించిన అతడు.. కామెంటేటర్‌గా రాణించాలని ఆశిస్తు్న్నాడు. అది కూడా భారత్, శ్రీలంక టెస్టు సిరీస్‌తోనే కామెంటరీ బాక్స్‌లో రహానే సందడి చేయనున్నాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ కామెంటరీ ప్యానెల్లో చోటు దక్కించుకున్న మాజీ కెప్టెన్.. టీమిండియా ఆరొందల టెస్టు మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయనున్నాడు.
The magic hasn’t stopped, it’s just found a new home! 🎙️✨
Welcome aboard Extraaa Innings, Jinks! 💙🏏#SonySportsNetwork #SonyLIV #BeautifulGameofTestCricket pic.twitter.com/IlJtzFoM91
— Sony Sports Network (@SonySportsNetwk) August 13, 2026
‘రహానే మ్యాజిక్ ఆగిపోలేదు. కొత్త ఇంటిని వెతుక్కుంది. ఎక్స్ట్రా ఇన్నింగ్స్‌లోకి స్వాగతం జింక్స్’ అని రహానేకు తమ కామెంటరీ బోర్డులోకి ఆహ్వానించింది సోనీ స్పోర్ట్స్. తన సుదీర్ఘ కెరీర్లో రహానే టీమిండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.

భారత జట్టుకు సారథిగా, వైస్ కెప్టెన్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా విశేష సేవలందించిన అతడికి బీసీసీఐ (BCCI) ‘ఫిక్స్డ్ పింఛన్’ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇకనుంచి నెలనెలా రూ.70 వేలు పింఛను రూపంలో రహానే అందుకోనున్నాడని బీసీసీఐ ధ్రువీకరించింది.