Assembly Session | తెలంగాణ ప్రజల భూములు, ఇండ్లను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి వాయిదా తీర్మానం అందజేశారు.
ప్రజల భూములు, ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్రతిపక్షం దాడిని డైవర్షన్ రాజకీయంతో ఎదురొనేందుకు అధికారపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ ‘వెయ్యి రోజుల వైఫల్యాల’పై బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ బుల్లెట్లు ఎక్కుపెట్టనుండగా 22ఏ నిషేధిత భూముల వివాదం, సాగునీటి ప్రాజెక్టులు, పాలిటెక్నిక్, విద్యార్థుల సమస్యల అస్ర్తాలను సంధించేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సంక్షేమ పథకాల బకాయిలు.. ఇలా ఒకో అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని సభలో నిలదీసేందుకు గులాబీ పార్టీ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.