KTR | అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపారు. హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం వెయ్యి రోజుల పాలన నిష్ఫలం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చారని, బాండ్ పేపర్లపై రాసి ఇచ్చారని గుర్తు చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
అందుకే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని రకాలుగా తమ పార్టీని అవమానించినా.. ప్రజల కోసం హామీల అమలును ప్రశ్నించాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కుట్రలు కొత్తేమీ కాదని.. గతంలో ఎన్నో చూశామని అన్నారు.
“రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున కాంగ్రెస్‌కు ఈ సమావేశాల్లో పలు ప్రశ్నలు అడుగుతాం. ఎందుకు హామీల అమలు కాలేదు? ఏమైంది? అని వారందరి తరఫున అడుగుతాం” అని కేటీఆర్ అన్నారు. 97 జీవోను రియల్ ఎస్టేట్ కోసం తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని ప్రశ్నిస్తామన్నారు.
ఎన్నికల ముందు “అభయహస్తం”గా ఉన్న కాంగ్రెస్.. ఎన్నికల తర్వాత “భస్మాసుర హస్తం”గా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతుల తరఫున రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల తరఫున కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, సర్వేయర్ల సమస్యలపైనా చర్చించాలని అన్నారు. 22ఏ ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిషేధిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌ను ఎన్ని అవమానాలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు ఎండగడతామని స్పష్టం చేశారు.