Ameesha Patel | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతోనూ తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి అమీషా పటేల్‌తో హార్దిక్‌కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గాసిప్‌పై అమీషా పటేల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఓ స్టార్ హోటల్లో జరిగిన విందులో అమీషా పటేల్, హార్దిక్ పాండ్యా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అమీషా తన స్నేహితులకు హార్దిక్‌ను పరిచయం చేస్తూ అతడి భుజంపై చేయి వేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ దృశ్యాన్ని ఓ నెటిజన్ ఎక్స్‌లో షేర్ చేస్తూ.. రెడ్డిట్‌లో హార్దిక్, అమీషా గురించి వస్తున్న రూమర్లు నిజమే కావచ్చంటూ కామెంట్ చేశాడు. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుమానం వ్యక్తం చేయడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే సాధారణ స్నేహాన్ని కూడా డేటింగ్‌కు ముడిపెట్టడంపై అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన డేటింగ్ రూమర్‌ను చూసిన అమీషా.. సదరు నెటిజన్ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతేకాదు, తనదైన వ్యంగ్యంతో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. హార్దిక్ భుజంపై చేయి వేయడాన్ని ప్రేమకు గుర్తుగా చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించేలా ఆమె స్పందించారు. ఒక మహిళ తన స్నేహితుడి భుజంపై చేయి వేయడం కూడా డేటింగ్‌కు సంకేతంగా భావించడం సరికాదని ఆమె తన సమాధానంతో స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. తన గురించి ఇలాంటి ఊహాగానాలు చేసే ముందు మహిళలు, పురుషుల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవాలని ట్రోలర్‌కు సూచిస్తూ అమీషా ఘాటైన సెటైర్ వేశారు. దీంతో హార్దిక్, అమీషా మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె ఇచ్చిన క్లారిటీతోనే చెక్ పడినట్లయింది. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహం, అనంతరం విడిపోవడం వంటి పరిణామాల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.గతంలో నటి ఎల్లి అవ్రామ్తో పాటు పలువురు మోడల్స్‌తోనూ హార్దిక్ పేరు వినిపించింది. తాజాగా మోడల్, నటి మహీకా శర్మతో హార్దిక్‌కు సన్నిహిత సంబంధం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.