The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ మూవీపై భారీ బజ్ నెలకొంది. దీనికి తోడు సినిమా నుంచి విడుదలైన ప్రచార కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే తాజాగా ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన మర్కండైజ్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. ముఖ్యంగా మర్కండైజ్ ఉత్పత్తికి రూ.25 వేల ధర నిర్ణయించారనే విషయం నెటిజన్లలో చర్చకు కారణమైంది. ఈ వ్యవహారం కాస్త ముదిరిన తర్వాత అధికారిక మర్కండైజ్ భాగస్వామి ఫిల్మడైస్ (Filmydice) స్పందిస్తూ క్షమాపణలు చెప్పింది.
సినిమాల ప్రమోషన్లో భాగంగా హీరోలు, సినిమాలకు సంబంధించిన టీ-షర్ట్స్, హుడీస్, క్యాప్స్, ఇతర కలెక్టబుల్స్ను మర్కండైజ్ పేరుతో విడుదల చేయడం సాధారణంగా మారింది. అదే విధంగా ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన మర్కండైజ్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు.అయితే అందులోని ఓ ఉత్పత్తికి రూ.25,000 ధర ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సినిమా అభిమానులను టార్గెట్ చేసి ఇంత భారీ ధర ఎందుకు పెట్టారంటూ కొందరు ప్రశ్నించారు. మరికొందరు ఈ ధరకు సంబంధించిన ప్రమోషన్‌పై విమర్శలు, ట్రోల్స్ చేశారు.ఈ నేపథ్యంలో మర్కండైజ్‌ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై కూడా వివాదం చెలరేగింది.
వివాదం నేపథ్యంలో ఫిల్మీడైస్ అధికారికంగా స్పందించింది. తమవైపు నుంచి జరిగిన తప్పిదానికి పూర్తి బాధ్యత వహిస్తున్నామని సంస్థ తెలిపింది. ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం నుంచి ముందస్తు అనుమతి లేదా ఆమోదం తీసుకోకుండానే ప్రమోషనల్ కంటెంట్‌ను షేర్ చేశామని Filmydice స్పష్టం చేసింది. ఈ ప్రచార కార్యకలాపం గురించి సినిమా టీమ్‌కు ముందస్తు సమాచారం లేదని కూడా వెల్లడించింది. దీంతో మర్కండైజ్కు సంబంధించిన ఈ వివాదంలో నాని లేదా ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం నేరుగా భాగస్వామ్యం లేదనే విషయాన్ని సంస్థ తన ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లయింది. వివాదం నేపథ్యంలో ఇప్పటికే షేర్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించినట్లు Filmydice వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.తమ తప్పిదం వల్ల ‘ది ప్యారడైజ్’ చిత్రబృందానికి, అభిమానులకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని సంస్థ కోరింది. ఈ వివరణతో మర్కండైజ్ వివాదం నుంచి సినిమా టీమ్‌ను వేరు చేసే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.