కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 16 : సింగరేణి వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా తమ సంస్థ ఉంటుందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సెంట్రల్ కమిటీ సభ్యుడు రాసూరి శంకర్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి మాట్లాడారు. రాసూరి శంకర్ మరణం కాంట్రాక్ట్ కార్మికులకే కాకుండా యూనియన్‌కు కూడా తీరని లోటన్నారు.
కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం శంకర్ అలుపెరుగకుండా కృషి చేశారన్నారు. రసూరి శంకర్ బాటలోనే ప్రతీ కాంట్రాక్ట్ కార్మికుడు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ తమ సంఘం అందరికి అందుబాటులో ఉంటుందని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీఎఫ్, ఈఎస్ఐ, పని ప్రదేశాల్లో కార్మికులు కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు.
ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికి అన్యాయం జరిగినా తమ దృష్టికి గానీ, సంబంధిత నాయకులకు కానీ తెలియజేస్తే వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు, కార్మికుల పరిరక్షణే ధ్యేయంగా గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల వెన్నంటే తాము ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తొగరు రాజశేఖర్, సంకుబాపన అనుదీప్ పాల్గొన్నారు.