భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 16 : బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొత్తగూడెం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. అధినేత కేసీఆర్ మీద అభిమానం, మీపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. తొలుత బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.