జూలురుపాడు, ఆగస్టు 01 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపొందాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జూలూరుపాడు మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిరిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు తలుచుకుంటూ కాంగ్రెస్ వాళ్ల మాయమాటలతో మోసపోయామని మదన పడుతున్నారన్నారు.
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చినట్లు దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల పేరుతో మొత్తం 420 హామీలు ఇచ్చి నేడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దురవస్థ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు రాబోవు రోజుల్లో మరోమారు పోరాట పటిమ చాటి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపొందే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, పార్టీ మండల నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, తాళ్లూరి రామారావు, పురస్తపురపు రామకృష్ణ, పోతురాజు కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.