– ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపహాడ్, జూన్ 26 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు, సూపర్వైజర్లు ఓటర్ల ఇంటికి వెళ్లిన సమయంలో ప్రతి ఓటరుకు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో పూర్తి వివరాలు నమోదు చేసి తిరిగి వారికి అందజేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఓటర్లకు సూచించారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకతో పాటు ఇరవెండి, మోతే పట్టీనగర్ గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఓటర్ల ఇంటికి వెళ్లి సర్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కల్పించారు. సర్ ప్రక్రియ అంటే కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమే అని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు కల్పించడానికి,
జాబితాలో తప్పులు సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
బీఎల్వోలు, సూపర్వైజర్లు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకుని కుటుంబంలో అర్హులైన ప్రతిఒక్కరి పూర్తి వివరాలు ఫారంలో నమోదు చేసి తిరిగి బీఎల్వోలకు అందించే సమయంలో రశీదు తీసుకోవాలన్నారు. సర్వే ద్వారా మరణించిన వారి పేర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారన్నారు. ఇంటింటి సర్వేలో బూత్ స్థాయి అధికారులు నేరుగా ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బూర్గంపహాడ్ డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య, బీఎల్వోలు పద్మ, దీపిక, శ్రీలక్ష్మి, మేరి, చందు ఉన్నారు.