తరతరాలుగా భక్తి పారవశ్యానికి, మతాచారాలకు మహిళలే మూలస్తంభాలుగా ఉంటూ వచ్చారు. కుటుంబంలో ఆధ్యాత్మికతను కాపాడటంలోనూ, పిల్లలకు విశ్వాసాలు నూరిపోయడంలోనూ వారే ముందుండేవారు. కానీ, నేటి జెన్జీ యుగంలో ఈ సంప్రదాయం వేగంగా రూపు మార్చుకుంటున్నది. తాజా అంతర్జాతీయ సర్వేల ప్రకారం… విశ్వాసాల విషయంలో దశాబ్దాలుగా ఉన్న లింగ వ్యత్యాసం దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. కొన్ని అంశాల్లో యువతుల కంటే యువకులే మతం వైపు ఎకువ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది. అయితే, లోతుగా పరిశీలిస్తే ఇది పురుషుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన దైవభక్తి కంటే వ్యవస్థీకృత మతాల పట్ల మహిళల్లో పెరుగుతున్న అసంతృప్తి, వైరాగ్యాల ఫలితమేనని స్పష్టమవుతున్నది. అమెరికన్ పోల్స్టర్ ‘గాలప్’ విడుదల చేసిన సర్వే గణాంకాలు ఈ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చాయి. 2024-25లో 18-29 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో 42% మంది తమ జీవితంలో మతానికి తీవ్ర ప్రాధాన్యం ఉందని చెప్పగా, రెండేండ్ల క్రితం ఉన్న 28%తో పోలిస్తే ఇది గణనీయంగా పెరగడం విశేషం.
ఇదే వయసు ఉన్న యువతుల్లో మతానికి ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య 2012-13లో 51% ఉండగా.. ఇప్పుడు అది 29 శాతానికి పడిపోయింది. ప్రార్థనలు, సేవలు, పిల్లలకు బోధనలలో మహిళలే ముందున్నా… నిర్ణయాత్మక నాయకత్వ హోదాల్లో వారికి దకాల్సిన ప్రాతినిధ్యం దకకపోవడం, పురుషుడి అధికారం – మహిళ విధేయత వంటి సంప్రదాయ పురుషాధిక్య నియమాల పట్ల నవతరం యువతుల్లో అసంతృప్తి పెరగడం, మీ-టూ ఉద్యమం, రో వర్సెస్ వేడ్ తీర్పు రద్దు తర్వాత మతం తీవ్ర సంప్రదాయ రాజకీయ శక్తులతో ముడిపడటం లాంటి సంఘటనలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఏదేమైనా, తరతరాలుగా వస్తున్న మతపరమైన లింగ వ్యత్యాస సమీకరణాలు.. జెన్జీ కాలంలో వేగంగా రూపుమార్చుకుంటున్నాయి. మత సంస్థలు తమ శతాబ్దాల నాటి పద్ధతులను మార్చుకోకపోతే, నవతరం మహిళలను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఈ గణంకాలు ఇస్తున్నాయి.