రామవరం, మార్చి 28 : కొత్తగూడెం ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న వి.కే.ఓ.సీ ని ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గతంలో జికేఓసి ని ఏ విధంగా సింగరేణి కార్మికులతో నడిపించిన విధంగా ఓవర్ బర్డెన్ (ఓబీ), కోల్ పూర్తిగా సింగరేణి ఉద్యోగులతో నడిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జికేఓసి మేనేజర్ మురళికి వినతిపత్రం అందజేసి దాన్ని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కాపుకృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన ఉంటూ కార్మికులకు అనేక హక్కులు తీసుకురావడం జరిగిందన్నారు. కాగా నేడు గెలిచిన యూనియన్లు కార్మికులకు ఏ ఒక్క హక్కు తీసుకురాలేదన్నారు. ఇప్పటికైనా అన్ని యూనియన్లను కలుపుకుని వికేఓసి ని సింగరేణి కార్మికులతో నడిపే విధంగా ఎండి, ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు.
జీకేఓసి మూతపడడంతో ఇక్కడ పనిచేసిన కార్మికుల్లో కొందరిని సత్తుపల్లి ఓసీలలో ట్రాన్స్ఫర్ చేయగా, మరి కొందరు డిప్యూటేషన్ పై సత్తుపల్లిలో విధులు నిర్వహిస్తున్నారని, రోజుకు 100 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేసి కాలము, వ్యయం, ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీకేఓసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పనులు చేపడితే కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కార్మికుల బాధలు అర్థం చేసుకోనైనా యూనియన్లు ఈ ప్రతిపాదనను యాజమాన్యం వెనక్కి తీసుకునేలా పోరాటం చేయాలన్నారు. లేకపోతే సింగరేణి ప్రైవేటీకరణ ఎంతో దూరంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ సభ్యులు కాగితపు విజయకుమార్, బొరింగ్ శంకర్, బ్రాంచ్ సెక్రెటరీ రాజ్ కుమార్, పివికే 5 ఫిట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు టీబీజీకేస్ నాయకులు, జికేఓసి ఉద్యోగులు పాల్గొన్నారు.