పాల్వంచ, జనవరి 27 : కొత్తగూడెం కార్పొరేషన్లోని పాల్వంచ పట్టణంలోని చెత్తను ఎర్రగుంట, జగ్గు తండా ప్రాంత సరిహద్దుల్లో వేయడాన్ని నిరసిస్తూ రెండు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మంగళవారం మున్సిపాలిటీ చెత్త సేకరించే వాహనాలు అడ్డుకున్నారు. అనంతరం జగ్గు తండాలోని బైపాస్ రోడ్డులో చెత్త వాహనాలు రాకుండా రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని కోరుతూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో మంగళవారం రోడ్డుపై బైఠాయించి చెత్త సేకరించే వాహనాలు అడ్డుకున్నారు. గ్రామం పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టి అందులోని చెత్తకు నిప్పు పెట్టడం వల్ల వచ్చే విషపూరిత పొగతో చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు. గ్రామం చుట్టూ చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోందన్నారు. మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా అటు అధికారులు గానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం వద్ద చెత్త వేయడం వెంటనే నిలిపి వేయాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వాహనాలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.