రామవరం, జులై 15 : భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సిపిఐ గ్రామ, పట్టణ శాఖ మహాసభల్లో భాగంగా రామవరం నెహ్రూబస్తీ, లక్ష్మీ టాకీస్ ఏరియా 1, 2, నేతాజీ బస్తీలో శాఖ మహా సభలు నిర్వహించారు. ప్రతి శాఖ కార్యదర్శి ప్రజలతో మమేకమై నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు. ప్రజా సమస్యలు ఉన్నంతవరకు, భూమిపై జీవం ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయన్నారు.
ఈ నెల 19న రామవరంలో జరిగే డివిజన్ మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిటీలను ప్రకటించారు. నెహ్రూ బస్తీ, లక్ష్మీ టాకీస్ ఏరియా 1, లక్ష్మీ టాకీస్ ఏరియా 2, నేతాజీ బస్తీ శాఖ కార్యదర్శిగా రావుల దాసు, ముద్దం మార్తమ్మ, రామ్ రాకేశ్, ఎస్కే అస్లాం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అల్లకొండ మోహన్, ఓం నారాయణ, ఎస్కే జానీ, తమ్మ సత్యనారాయణ, వాసం బాబు, మహిళల కార్యదర్శులుగా తమ్మ దుర్గ, తహేర, రహేన, రాజేశ్వరి, సుప్రియ పాల్గొన్నారు.