పాల్వంచ, ఏప్రిల్ 18 : అలవికాని హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. పాత పాల్వంచలో ఆయన స్వగృహంలో శుక్రవారం వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజోత్సవాల సందర్భంగా నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అయినా కూడా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం కాంగ్రెస్ ఎజెండాగా మారిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నారని, అలాగే రైతు భరోసా లేక పంట రుణాలు దొరక్క రైతులు ఇబ్బందుల పాలయ్యారని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నెత్తినోరు బాదుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని రైతులు బాగుపడ్డారని మళ్లీ కేసీఆర్ రావాలని రైతులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్, కిలారు నాగేశ్వరరావు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, పాల్వంచ మండల అధ్యక్షుడు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, కొత్వాల సత్యనారాయణ, డిష్ నాయుడు, కనగాల బాలకృష్ణ, ఎంపీపీ మడివి సరస్వతి, దాసరి నాగేశ్వరరావు, ముత్యాల ప్రవీణ్, భూక్య వీరన్న, రాంబాబు, దాబా శంకర్, సమ్మయ్య గౌడ్, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల, తదితరులు పాల్గొన్నారు.