– అధికారుల నిర్లక్ష్యంతో ఎరువు కోసం రైతుల అవస్థలు
చుంచుపల్లి, జూలై 14 : వానాకాలం సాగు కీలక దశలో ఉన్న సమయంలో చుంచుపల్లి మండల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీని యాప్ ఆధారిత బుకింగ్ విధానంలో అమలు చేస్తున్నప్పటికీ, చుంచుపల్లి మండలానికి యాప్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం చుంచుపల్లి మండల రైతులు కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా మాత్రమే యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే మండలానికి సంబంధించిన యాప్ అందుబాటులో లేకపోవడంతో రైతులు సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి తదితర మండలాల యాప్‌లలో బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వెళ్లిన రైతులను “మా మండలానికి ఎందుకు వచ్చారు?” అంటూ ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది నుంచే యూరియా కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రతి సారి అధికారులు “ఇప్పుడు వస్తుంది.. కొద్దిసేపట్లో సమస్య పరిష్కారమవుతుంది” అంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వానాకాలం సీజన్లో పంటలకు అత్యవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటల పెరుగుదలపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రస్తుతం 475 యూరియా బస్తాలు నిల్వలో ఉన్నప్పటికీ, యాప్ అందుబాటులో లేకపోవడంతో రైతులకు పంపిణీ జరుగుతుందో లేదో అనే అనిశ్చితి నెలకొంది. అంతేకాక, యూరియా స్టాక్ వచ్చినా కొద్ది గంటల్లోనే పూర్తిగా అయిపోతుందని, అనంతరం మళ్లీ కొత్త స్టాక్ రావడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో సాగు పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అదే ఉమ్మడి జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి ఇప్పటి వరకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి రాకపోవడం, రైతులకు యూరియా సరఫరాలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. “ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా కూడా రైతులు యూరియా కోసం ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందా?” అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. యాప్ అందుబాటులో లేకపోవడం, యూరియా స్టాక్ కొద్ది గంటల్లోనే పూర్తిగా అయిపోవడం, మళ్లీ కొత్త స్టాక్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురాకపోవడం వంటి సమస్యలు రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని చుంచుపల్లి మండల రైతుల సమస్యలను పరిష్కరించాలని, మండలానికి ప్రత్యేక యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అవసరమైన మేర యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే సాగు పనులు దెబ్బతిని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
చుంచుపల్లి మండల రైతులు యూరియా బుకింగ్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చినట్లు వ్యవసాయ అధికారి రాజేశ్వరి, కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ రెడ్డి తెలిపారు. సమస్యను ఇప్పటికే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మంగళవారం సాయంత్రం వరకు చుంచుపల్లి మండలానికి సంబంధించిన యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 475 యూరియా బస్తాలు నిల్వలో ఉన్నాయని, యాప్ సమస్య పరిష్కారమైన వెంటనే రైతులకు యూరియా పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.