కొత్తగూడెం అర్బన్, జూలై 18 : రైతులకు ఏర్పడిన యూరియా సమస్యను నివారించాలని, రైతులందరికీ ప్రభుత్వమే యూరియా సరిపడా సరఫరా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రైటర్ బస్తీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటకాలం మొదలై విత్తనాలు వేసుకున్న రైతులకు యూరియా సరిగ్గా అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. కుటుంబంతో సహా తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూలైన్లలో రాత్రి 10 గంటల వరకు నిలబడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా ప్రభుత్వం అందించకపోవడంతో రైతుల పంటలు మొత్తం నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
యూరియా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వమే యూరియాని రైతులకి సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చలో కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కె.సారంగపాణి, రాష్ట్ర నాయకుడు డి.ప్రసాద్, కొత్తగూడెం ఏరియా కార్యదర్శి ఎన్.సంజీవ్ పాల్గొన్నారు.