హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మానవ హకుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ వల్ల 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కస్తూర్బాలో పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిలకు వైద్య సాయం అందించాలని కోరారు. ఘటనను మానవ హకుల ఉల్లంఘనగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్కు విజ్ఞప్తిచేశారు.