జూలూరుపాడు, జూన్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఇప్పుడు చెత్తా చెదారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం ప్రధాన రహదారి పక్కన, ఏకంగా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలను తలపిస్తూ అనధికారిక డంపింగ్ యార్డ్‌గా మారాయి. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు వ్యాపారుల నిర్లక్ష్యం వెరసి స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెడుతున్నాయి.
గతంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పొలానికి చెందిన రైతులు మట్టి కోసం తీసిన భారీ గుంత ఇప్పుడు స్థానిక వ్యాపారులకు వ్యర్థాలు పారబోసే అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో కొందరు వ్యాపారులు, హోటల్ యజమానులు, కొబ్బరి బొండాలు విక్రయించేవారు, జ్యూస్ పాయింట్ల నిర్వాహకులు తడి, పొడి చెత్తను ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా ఇక్కడ పారబోస్తున్నారు. ఈ తడి చెత్త, ఇతర వ్యర్థాలు మురిగిపోయి ఆ దారిన వెళ్లే ప్రయాణికులకు ముక్కుపుటలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. ఈ ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వ పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పెద్ద వృక్షాలుగా మారాయి. కానీ ఆ చెట్ల మధ్య ఉన్న పచ్చని ఆహ్లాదకరమైన స్థలాలు ఇప్పుడు కొబ్బరి బోండాలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలకు నిలయంగా మారాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని డివైడర్ నుండి మొదలుకుని సాయిబాబా దేవాలయం వరకు రహదారికి ఇరువైపులా ఎటు చూసినా ఈ చెత్తాచెదారమే దర్శనమిస్తుండడం గమనార్హం.
ఒకవైపు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చెత్తాచెదారం స్థానికులకు మరింత ప్రాణ సంకటంగా మారనుంది. పారిశుధ్యం పూర్తిగా లోపించడంతో ఈ ప్రాంతమంతా ఇప్పటికే దోమల స్వైర విహారానికి అడ్డాగా మారింది. దీనికి తోడు వానలు కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా చెట్ల మధ్య విచ్చలవిడిగా పారబోసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరి నిల్వ ఉంటే అవి డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేసే దోమలకు ప్రధాన ఆవాసాలుగా మారుతున్నాయి. మురుగు నీరు, తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం వల్ల ప్రయాణికుల తోపాటు ఇటు స్థానిక ప్రజలకు అంటువ్యాధుల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది.

జూలూరుపాడులో అనధికారిక డంపింగ్ యార్డ్
ఈ చెత్త గుట్టలు కేవలం పర్యావరణానికి, ప్రజారోగ్యానికే కాకుండా మూగజీవాలకు కూడా ప్రాణాంతకంగా పరిణమించాయి. రహదారి పక్కన సంచరించే గోవులు, ఇతర పశువులు ఆకలి తీర్చుకునే క్రమంలో ఈ వ్యర్థాల వద్దకు చేరుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను, ఆ కవర్లతో సహా తినేస్తుండటంతో అవి తీవ్ర అనారోగ్యం పాలై మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా రాత్రి వేళల్లో పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న హృదయవిదారక దృశ్యాలు నిత్యం దర్శనమిస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన రహదారి పక్కన ఇంతటి తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ, పంచాయతీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వర్షాకాలం రాకముందే ఈ డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా శుభ్రపరచాలి. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పక్కన చెత్త వేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టి ప్రజల, మూగజీవాల ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.