జూలూరుపాడు, మార్చి 30: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని టీయూసీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు విమర్శించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన ‘నాలుగు లేబర్ కోడ్స్’ కార్మిక వర్గానికి ఉరితాడుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లేబర్ కోడ్ ప్రతులను దహనం చేసిన అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా TUCI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ..
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం ఒత్తిడికి తలొగ్గకుండా ఈ లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెలంగాణ శాసనసభలో ఈ కోడ్లకు వ్యతిరేకంగా తక్షణమే తీర్మానం చేయాలని టీయూసీఐ తరపున ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు కోడ్ల వల్ల కార్మిక లోకం బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నేతలు గోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ : ఈ కోడ్ కారణంగా కార్మికులు సంఘం పెట్టుకునే ప్రాథమిక హక్కును కోల్పోతారు. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి చట్టబద్ధత కల్పించినట్లవుతుంది. వేతన కోడ్ కనీస వేతనం, బోనస్ వంటి అంశాలలో కార్మికులకు రక్షణ కరువవుతుంది. సామాజిక భద్రత కోడ్ పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
వృత్తిపరమైన భద్రత, పని పరిస్థితుల కోడ్ : పని గంటల పెంపు, భద్రత లేని పని ప్రదేశాలు కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బీజేపీప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, అన్నదాతలను, శ్రమజీవులను రోడ్డున పడేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాయల సిద్దు (టీయూసీఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు), బానోత్ ధన్వంతరావు (గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి), సేవ్య, ఆటో కార్మికులు వీరభద్రం, అనంతయ్య, సేవాలాల్, రాకేష్ తదితరులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు.