అశ్వారావుపేట : తిమ్మాపురం గ్రామ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలంలోని తిమ్మాపురం గిరిజనులు భద్రాచలం ఐటీడీఏ పీఓని కలిసి తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. వేదాంతపురం గ్రామ పంచాయతీలోని తిమ్మాపురం గ్రామం రిజ్వరు పారెస్టులో ఉండటం వల్ల ఆ గ్రామానికి విద్యుత్, తాగునీరు, రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నామని పీవోకు ఫిర్యాదు చేశారు.
గ్రామ పంచాయతీ నిధులతో ఏ అభివృద్ది పని చేయలేకపోతున్నామని సర్పంచ్ ప్రసాద్ వివరించారు. 50 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేవని, పూరిగుడిసెల్లోనే కొనసాగుతున్నాయని సర్పంచ్ వివరించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ మాట్లాడుతూ వీలైనంత తక్కువ సమయంలోనే తిమ్మాపురం గ్రామానికి విద్యుత్, తాగునీరు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.