కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 26 : దసరా పండుగ సంధర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందించనున్నట్లు కొత్తగూడెం డీఎం యు.రాజ్యలక్ష్మీ శుక్రవారం తెలిపారు. ఈ నెల 27 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ, నాన్ ఏసీ, లహరి ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారు ప్రయాణం అనంతరం టికెట్ వెనుకాల ప్రయాణికుడి పేరు, సెల్ నంబర్, అడ్రస్ రాసి కొత్తగూడెం డిపో పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు బస్టాండ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్సుల్లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీన రీజినల్ మేనేజర్ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండవ బహుమతి రూ.15 వేలు, మూడవ బహుమతి రూ.10 వేల నగదును అందిచనున్నట్లు వెల్లడించారు. దసరా పండుగకు ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఆమె ఆకాంక్షించారు.