ఇల్లెందు, మే 20 : జేకేఓసీ కార్మికుల ట్రాన్సఫర్ ఆపాలి అని టీబీజీకేఎస్ నాయకులు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, ఇల్లెందు ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎం.డీ జాఫర్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్ దిండిగల కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఒకవైపు ఇల్లెందును కాపాడుతాం, కార్మికుల ట్రాన్సఫర్లు ఆపుతామని చెప్పి గెలిచిన సంఘాలు ఈ రోజు కార్మికులు ట్రాన్సఫర్ అవుతుంటే చోద్యం చూస్తున్నట్లు తెలిపారు. పూసపల్లి ఓసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కొత్త ఓసీలో తమకు భవిష్యత్ ఉంటుందని, ఇక ట్రాన్సఫర్లు లేకుండా ఉంటామని కార్మికులు భావించారు. గెలిచిన సంఘాలు, నాయకులు కూడా ఒక్క కార్మికుడిని ఇక్కడినుండి ట్రాన్సఫర్ కానివ్వమని చెప్పడంతో భరోసాగా ఉన్నారు.
కానీ యాజమాన్యం మాత్రం డిప్యూటేషన్ అంటూ వంద కిలోమీటర్ల దూరం పంపడం, అందునా పాఠశాలలు ప్రారంభం కానున్న తరుణంలో ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని కార్మికులు వాపోతున్నారు. కొంతమంది సీనియర్ కార్మికులు తమకు ట్రాన్సఫర్ ఇవ్వండి అని అడుగుతున్నా వారిని పక్కన పెట్టి డిప్యూటేషన్ ఇవ్వడమేమిటి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీనియారిటీని కాదని ప్రొటెక్టెడ్ వర్క్ మెన్ అని కొంతమంది జూనియర్ కార్మికులను అప్పటికప్పుడు GM స్ట్రక్చర్ కమిటీలో పేర్లు పెట్టించి వారిని ఆపే ప్రయత్నం కార్మిక ద్రోహమేనని, ఇది కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే అని కార్మికులు పేర్కొంటున్నారు.
ఒకవైపు సింగరేణి చైర్మన్ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని చెబుతుంటే కొందరి ట్రాన్సఫర్లు ఆపడానికి అడ్డదారుల్లో కార్మికసంఘాలు ప్రయత్నం చేయటం హేయమైన చర్య అని, దీనిని TBGKS తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రొటెక్టెడ్ వర్క్మెన్కు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటిని పాటించాలని లేదంటే కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని తెలిపారు. ట్రాన్సఫర్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఏరియా అధికారులపై ఉందని. అవినీతికి ఆస్కారం లేకుండా ఏరియా గౌరవాన్ని కాపాడాలని టీబీజీకేఎస్ కోరుతుందని నాయకులు పేర్కొన్నారు.