– కొత్తగూడెం గడ్డపై గులాబీ జెండా ఎగరాలి
– కాంగ్రెస్ బాకీ కార్డులే ప్రచారాస్త్రాలు
– కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
– జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19 : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో కార్పొరేషన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని అందువల్లనే బాకీ కార్డులను ఇంటింటికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్లో సర్వే చేసి విజయవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తామన్నారు. ఒక వార్డులో ఇద్దరిని ఎంపిక చేసి హై కమాండ్‌కు పంపడం జరుగుతుందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైనల్ చేసిన జాబితా వరకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వరావుపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జిల్లాలోని ఎన్నికల లేని పంచాయతీలు, మండలాల్లో ముఖ్య నాయకులు కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారానికి తరలి రావాలన్నారు. రెండు రోజుల్లోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రచారంలో దూసుకుపోవాలన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పట్టుదలతో పనిచేసి కార్పరేషన్‌లో గులాబీ జెండాను ఎగురవేసి కేటీఆర్‌కి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రచారం పోస్టర్, కాంగ్రెస్ బాకీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు అన్నవరం భాషా, మాజీ చైర్పర్సన్ కాపు సీతామాలక్ష్మి, దామోదర్, సింధు తపస్వి, బొంతల వీరయ్య, రాజు గౌడ్, కనకేష్, కొట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, బాదావత్ శాంతి పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’