– బొగ్గు బ్లాకుల ప్రవేటీకరణను అడ్డుకుంటాం
– సింగరేణి మనుగడకు కొత్త బొగ్గు బ్లాకులు రావాలి
– కార్మికవర్గ పోరాటాలకు సిద్ధం
– ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు
రామవరం, అక్టోబర్ 16 : సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, సింగరేణి మనుగడ కాపాడాలంటే కొత్త బొగ్గు బ్లాకులు రావాలని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం వీ కే సీ ఎం, పీవీకే 5 గనుల్లో పర్యటించి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం ఏరియా జీఎం షాలెం రాజుతో సమావేశమైయ్యారు. ఏరియాలోని వీ కే సీ ఎం, పీవీకే 5 గనుల్లో విస్తృతంగా పర్యటించి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి కార్మిక సమస్యల పట్ల మడమ తిప్పకుండా పోరాడుతామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సొంతింటి పథకం అమలు చేయాలని, కార్మికులకు ఇన్కం ట్యాక్స్ రద్దు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు.
స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న డిమాండ్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఏఐటీయూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని నేడు ప్రైవేటీకరణ వల్ల ఆ హక్కులు ఒక్కక్కోటిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని, సింగరేణిలో ప్రైవేటీకరణ అయితే పర్మినెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏఐటీయూసీ నాయకులు శేషగిరి రావు, విఠల్ రావు, రాజ్ బహద్దూర్ గౌర్, యూనియన్ కొమురయ్య దశాబ్దాల కిందటే చేసిన పోరాటాల ఫలితంగా దీపావళి బోనస్, లాభాల వాటా, పెన్షన్ స్కీమ్ లు సాధించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ నిలుపుదల సరైంది కాదన్నారు .
మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ విధానాల పట్ల ఆకర్షితులైన పలువురు కార్మికులు ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్ లో చేరారు. అనంతరం కొత్తగూడెం ఏరియా జీఎం నూతన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వీ కే ఓ సి, కార్మికుల అంతర్గత బదిలీలు ఏరియాలోని పలు కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు, అనంతరం ఎఐటియుసి చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులు అయిన పి వి కే- 5 యువ కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో యూనియన్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.వీరాస్వామి, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శులు హుమాయూన్, మధుకృష్ణ, కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సురేందర్, సీనియర్ నాయకులు వాసిరెడ్డి మురళి, బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, కుర్రు రమేష్, బనోత్ రమేష్, సాయిపవన్, బండి వెంకటరమణ, కుమారకృష్ణ, క్రాంతి, కుమార్, మహిళా కార్మికులు పాల్గొన్నారు.