ఇల్లెందు, జులై 03 : ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. గురువారం రోజు వర్క్ షాప్. జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బందితో నిర్వహించిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ నల్ల చట్టాలుగా మార్పు చేయడానికి జేఏసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.
ఈ నల్ల చట్టాలు కార్మికుల హక్కులను హరించేలా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలగాలని జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సారయ్య, జె.వెంకటేశ్వర్లు, నబీ, అబ్బాస్, సత్యనారాయణ, మహబూబ్, యాదగిరి, కృష్ణారావు, ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.